రాగసాగరిక - నిగ్గదీసి అడుగు

పాట: నిగ్గదీసి అడుగు

సినిమా: గాయం

గీత రచయిత: సిరివెన్నెల సీతారామ శాస్త్రి


"ఈ జనాలు ఇంతేరా.... ఇంక మారరు" అన్న మాట ఎవరు చెప్పినా నాకు గుర్తొచ్చే మొదటి పాటి ఇది. నిజంగా జనాలు ఇంతేనా? మారరా? అనే ప్రశ్నకి సమాధానం వెతుక్కుంటూ పాటలోకి వెళ్తే ఇంకా చాలా ప్రశ్నలు ఎదురవుతాయి. ఆ జనంలో నువ్వు ఉన్నావా? లేవా? ఉంటే మార్పు నీలో కూడా రావాలా? నీ నుంచి మొదలవ్వలా? ఈ ప్రశ్నలన్నీ ఇంకో కొత్త సమాధానాన్ని నీకిస్తాయి.


#1 నిగ్గదీసి అడుగు సిగ్గులేని జనాన్ని

అగ్గితోటి కడుగు సమాజ జీవచ్ఛవాన్ని

మారదు లోకం మారదు కాలం

దేవుడు దిగి రానీ ఎవ్వరు ఏమైపోనీ

మన చుట్టూ ఎం జరిగితే మనకెందుకు అనుకునే సమాజం ఎవరికోసం మారుతుంది? దేవుడు దిగివచ్చినా ఎవ్వరు ఏమైపోయినా మారని జీవచ్ఛవం ఇది. అందుకే సిరివెన్నెల గారు బతుకుతున్న శవాన్ని అగ్గితో కడగమని ఆక్రోశ భావం వ్యక్తపరిచారు.#2 గాలివాటు గమనానికి కాలిబాట దేనికి?

గొర్రెదాటు మందకి నీ జ్ఞానబోధ దేనికి

చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం

క్షణాన మార్చుకుంది చిచ్చుల మార్గం

రామ బాణం ఆపిందా రావణ కాష్టం

కృష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రం

ఎటు గాలి బాగా వీస్తే అటు వెళ్లిపోయే జనాలకి మన జ్ఞానబోధ మేరకు పనిచేస్తుంది?

జ్ఞానబోధ మేరకు పనిచేస్తుంది?

జ్ఞానబోధ ఆపి మనమైనా ధర్మం కోసం యుద్ధం మొదలుపెట్టాలి. ఇంతమందికీ లేనిది నాకే ఎందుకు అనుకుంటే ఇక మన చరిత్రలో ఎప్పటికీ పచ్చని పాఠం ఉండదు. ధర్మం కోసం రాముడే రావణకాష్టానికి, కృష్ణుడే కురుక్షేత్రానికి కారణాలయ్యారు. ఇక మనమెంత?


#౩ పాతరాతి గుహలు పాలరాతి గృహాలైన

అడవి నీతి మారిందా ఎన్ని యుగాలైనా


వేట అదే వేటు అదే నాటికదే అంతా

నట్టడవులు నడివీధికి నడిచొస్తే వింతా?!


బలవంతులే బతకాలని సూక్తి మరువకుండా

శతాబ్దాలు చదవలేదా అరణ్యకాండ


ఎన్ని యుగాలు గడిచినా అడవి నీతి ఎవ్వడూ మార్చి చెప్పడు. సింహమే జింకని వేటాడాలి. చలిచీమల చేత చిక్కి చనిపోయిన పాముని జనాలు ఎప్పుడో మర్చిపోయారు.


యుగాలు మారి మనుషులు పాతరాతి గుహలు నుండి పాలరాతి గృహాల వరకూ వచ్చారు. కానీ అదే అడవి నీతిని మోసుకుంటూ వచ్చారు. బలవంతుడే బతకాలి. అదే అరణ్యకాండ!!